Telangana Cyber Scam
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చరిత్రలో అత్యంత పెద్ద సైబర్ ఆర్థిక మోసం ఇది.
ఈ ఘటనలో, 75 ఏళ్ల వృద్ధుడు రూ. 13 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్‌లో సీనియర్ మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు.
వివరాల ప్రకారం, జూలై 1న ఆయనకు వాట్సాప్ ద్వారా పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్రతిపాదన వచ్చింది. 10 రోజుల్లోనే మోసగాళ్ల చూపిన లాభాల ప్రలోభంతో రూ. 4 కోట్లు పెట్టుబడి పెట్టారు.

అకౌంట్‌లో రూ. 10 కోట్లు చూపించాక, ఆయన డబ్బును తీసుకోవాలని అనుకున్నారు. కానీ జీఎస్టీ, సీజీఎస్టీ, కన్వర్షన్ ట్యాక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ వంటి వివిధ పన్నులు చెల్లించాలని చెప్పి మోసగాళ్లు మరో 15 రోజుల్లో రూ. 9 కోట్లు కట్టించుకున్నారు.
ఈ పెట్టుబడులను చేయడానికి, అతను మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర పొదుపు స్కీముల నుండి డబ్బు తీసుకుని, తన బ్యాంకు ఖాతా ద్వారా బదిలీ చేశాడు. దాదాపు 50 రోజుల తరువాత మాత్రమే అతను మోసపోయినట్లు గుర్తించాడు.
సోమవారం, ఆయన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
అయితే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కావడం వల్ల డబ్బు రికవరీ అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. మొత్తం రూ. 13 కోట్లలో, పోలీస్‌లు కేవలం రూ. 20 లక్షలను మాత్రమే రికవర్ చేయగలిగారు.
ఈ మొత్తాన్ని చెక్కులు, ఏటీఎం కార్డులు వంటివి ఉపయోగించి, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వంటి వివిధ రాష్ట్రాల్లోని అకౌంట్ల ద్వారా డ్రా చేశారు. మొత్తం రూ. 2 కోట్లు దుబాయ్ నుంచి డ్రా చేయబడ్డాయి. హైదరాబాదులో కొంత డబ్బు డ్రా అయిన నేపథ్యంలో, అక్కడ ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.