ప్రసిద్ధ రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా, రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పోరాడిన ఈ రెజ్లర్లు, కాంగ్రెస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వినేష్ ఫోగట్ మరియు పునియా, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్టీలో చేరారు.

వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, బ్రిజ్ భూషణ్ సింగ్ లాంటి వ్యక్తుల చేతుల్లో మహిళలు బాధపడకుండా, తాను రాజకీయాల్లో మహిళల కోసం పోరాడతానని తెలిపారు. ఆమె రైల్వేలోని ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లో దేశ సేవ చేయాలని నిర్ణయించుకుంది.
బజరంగ్ పునియా కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఫోగట్ మరియు పునియాపై మద్దతు తెలుపుతూ, రాజకీయాలలోకి అడుగు పెట్టడాన్ని స్వాగతించారు.

బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణల తర్వాత, ఫోగట్ మరియు పునియా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఐటీ సెల్ తమను ఆపదలో పడేయాలని ప్రయత్నించిందని, కానీ కాంగ్రెస్ మాత్రమే తమకు మద్దతు ఇచ్చిందని వారు తెలిపారు.

దీనిపై బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందిస్తూ నువ్వు మోసం చేసి పారిస్ కి వెళ్ళావు. దేవుడు నిన్ను శిక్షించాడు” అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు అన్నారు.
ఈ ఇద్దరు రెజ్లర్లు రాజకీయ రంగంలోకి రావడం, హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొత్త శక్తిని ఇస్తుంది. యువత మరియు రైతులలో విస్తృత మద్దతు ఉన్న వీరు, హర్యానాలో కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.