సాప్ట్వేర్ ఉద్యోగాలు అంటే హైదరాబాద్, బెంగళూరు అనే మెట్రో నగరాలే గుర్తుకొస్తాయి. కానీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చింత అనిల్ కుమార్ మాత్రం సొంత ఊర్లోనే సాప్ట్వేర్ స్టార్టప్ ప్రారంభించి, తన ప్రతిభతో 100 కోట్ల టర్నోవర్ సాధించాడు. అమరావతి సాప్ట్వేర్ ఇన్నోవేషన్ పేరుతో అతను ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 200 మంది సాప్ట్వేర్ నిపుణులతో విస్తరిస్తూ, 14 రకాల సర్వీసులు అందిస్తోంది.
సాప్ట్‌వేర్‌లో ముందడుగు
అనిల్ తన చదువును పాలకొండ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి, ఇంజినీరింగ్, ఎం.టెక్ ను రాజమహేంద్రవరం గైడ్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. స్నేహితులు వేరే ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళుతుంటే, అనిల్ మాత్రం సొంత ఊర్లోనే కెరీర్ మలచుకోవాలని నిర్ణయించాడు. పాత కంప్యూటర్ అద్దెకు తీసుకొని, 100 అడుగుల గదిలో స్టార్టప్ మొదలు పెట్టాడు.
విజయానికి మార్గం
2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా అనిల్ రూపొందించిన పబ్లిక్ యాప్‌లకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందించడంతో, అతని కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ఆ ప్రోత్సాహంతో, అనిల్ అమరావతి సాప్ట్వేర్ ఇన్నోవేషన్ సంస్థను స్థాపించాడు. ఇప్పుడు 500కుపైగా ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సేవలందిస్తున్నాడు.

స్థానిక యువతకు అవకాశాలు
అమరావతి సాప్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా 4,300 మందికి పైగా స్థానిక యువతకు శిక్షణ ఇచ్చిన అనిల్, వారికి నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు.
తక్కువ ఫీజుతో డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులు అందిస్తూ, స్థానిక యువతకు మెట్రో నగరాలకు వెళ్లకుండా, సొంత ఊర్లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు.

విస్తరిస్తున్న వ్యాపారం
చిన్న సాప్ట్వేర్ సంస్థగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు రాజమండ్రి నుంచే అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు సాప్ట్వేర్ సేవలు అందిస్తోంది. కడప, విజయవాడ, వైజాగ్‌లలో బ్రాంచ్‌లను ప్రారంభించడం ద్వారా, తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అనిల్ ఆశతో ఉన్నాడు.
ఇది కూడా చదవండి – పేర్ని నాని ఇంటి పై జనసేన కార్యకర్తల దాడి
1 thought on “అద్దె కంప్యూటర్ నుండి 100 కోట్ల టర్నోవర్ వరకు అనిల్ కుమార్ సక్సెస్ స్టోరీ | Rajahmundry Anil Kumar Success Story”